కెరీర్ అంటే ఇంజనీరింగొక్కటే కాదు. ఇంజనీరింగ్ వల్ల అప్లికేషన్స్ మాత్రమే తెలుస్తాయి. ఆ అప్లికేషన్స్ వెనుకనున్న సైన్స్ గురించి తెలుసుకోవాలనేది నా కోరిక. అందుకే సైన్స్‌ను కెరీర్‌గా ఎంచుకున్నా. చిన్నప్పటినుంచీ సైన్స్ గురించి తెలుసుకోవడమంటే ఇష్టం. భవిష్యత్తులో లేజర్‌ఫిజిక్స్‌లో సైంటిస్ట్‌గా రాణించాలనేదే నా లక్ష్యం. ప్రతి విద్యార్థికీ తన లక్ష్యంపై స్పష్టమైన అవగాహన ఉండాలి. అప్పుడే దాన్నందుకోవడం సాధ్యమౌతుంది. ” నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తని కలవడమే గొప్ప అవకాశం, అలాంటిది ఏకంగా 27 మంది శాస్త్రవేత్తల్ని కలవడం, వారితో అభిప్రాయాల్ని పంచుకోవడం నిజంగా మధురానుభూతి” అంటున్నారు 62వ నోబెల్ లారెట్స్ సదస్సుకు హాజరైన హైద్రాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యార్థి హర్షవర్థన్‌రెడ్డి. ఆయనతో సాక్షి ఇంటర్వ్యూ..
నోబెల్ సదస్సుకు వెళ్లే అరుదైన అవకాశం మీకు వచ్చింది. దీని పై మీ స్పందన ?
నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తల్ని కలుసుకోవాలని ప్రతీవిద్యార్థి ఉవ్విళ్లూరతాడు. అలాంటిది 27 మంది శాస్త్రవేత్తల్ని కలుసుకోవడమంటే నిజంగా అదో అద్భుతం. సంతోషంతో నాకు మాటలు రావడం లేదు. జర్మనీలో నిర్వహించే ఈ సమావేశానికి ప్రపంచంలోని 70దేశాల నుంచి 580 మంది విద్యార్థులను ఎంపికచేస్తారు. భారత దేశం నుంచి ఎంపికైన 18 మందిలో నేను ఒకణ్ణి. హైద్రాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రవిభాగంలో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ చదువుతున్ననాకు ఈ అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది.
మీ గురించి చెప్పండి ?
మాది నల్గొండ జిల్లా రాములబండ. ఉపాధ్యాయుడు, అమ్మ గృహిణి. పదోతరగతి వరకూ సొంత జిల్లాలోనే చదువుకున్నాను. నెల్లూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదివాను. తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎస్సీ(ఇంటిగ్రేటెడ్) ఫిజిక్స్‌లో చేరాను. ప్రస్తుతం ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ ఫిజిక్స్ నాలుగో సంవత్సరం చదువుతున్నాను.
జర్మనీలో నిర్వహించే ఈ నోబెల్ సదస్సుకు విద్యార్థులను ఎవరు ఎంపిక చేస్తారు ?
భారత సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం, జర్మనీ రీసెర్చ్ ఫౌండేషన్ కలిసి సదస్సుకు వెళ్లే విద్యార్థులను ఎంపికచేస్తాయి. అందుకు ప్రతీ సంవత్సరం నోటిఫికేషన్ విడుదల చేస్తాయి. దానికి నేను దరఖాస్తు చేశాను. చిన్నప్పటినుంచీ సైన్స్‌పై ఆసక్తి ఉండడం, ఫిజిక్స్‌లో పలు సృజనాత్మక ప్రయత్నాలు చేయడంతో సెంట్రల్ యూనివర్సిటీ నుంచి నన్ను నామినేట్ చేశారు.
జర్మనీ సదస్సు ద్వారా మీరు తెలుసుకున్న విషయాలు చెప్పండి?
సైన్స్ సబ్జెక్టులో ఏదైనా ఓ అంశాన్ని తీసుకుని దానిపైనే ప్రధానంగా దృష్టిసారించి పరిశోధన చేస్తేనే విజేతగా నిలుస్తారని 2011లో నోబెల్ బహుమతి పొందిన ఓ సైంటిస్ట్ చెప్పారు. రానురాను ప్రపంచంలో విద్యుత్తుశక్తి అవసరాలు అమాంతం పెరిగిపోతాయని, దానినుంచి బయటపడేందుకు శక్తివనరులను కాపాడుకుని సౌరశక్తి వ్యవస్థను వద్ధిచేసుకోవాలని సైంటిస్టులంతా తమ ప్రసంగాల్లో వెల్లడించారు. సైన్స్ పరిశోధన అనేది ల్యాబ్‌లో జరగాలా? ప్రకృతి మధ్య జరగాలా? అని నేనడిగిన ప్రశ్నకు సమాంతరంగా జరగాలని అవార్డుగ్రహీతలు వివరించారు. భౌతికశాస్త్రలో ప్రతి ఒక్కటీ క్వాంటం ఫిజిక్స్‌పైనే ఆధారపడి ఉంటుంది. అలాంటప్పుడు దీనికి ప్రత్యామ్నాయం ఉందా? అనే దానికి ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయాలు సృష్టించడం సాధ్యంకాదని మీలాంటి విద్యార్థులు అందరూ పరిశోథన రంగంలో ప్రవేశిస్తే అది కచ్ఛితంగా సాధ్యమవుతుందన్నారు.
పరిశోధన రంగాల్లో జర్మనీ ప్రఖ్యాతి చెందడానికి కారణాలు ఏమిటి?
పరిశోధన రంగానికి జర్మనీలో ప్రాధాన్యతెక్కువ. సైన్స్ ల్యాబరేటరీలు పూర్తిస్థాయి సౌకర్యాలతో ఏప్రయోగం చేయడానికైనా వీలుగా సైంటిస్టులకు వెన్నుదన్నుగా ఉంటాయి. మనదగ్గర ఏదైనా ప్రయోగం చేయాలంటే అందుబాటులో ఉన్న పరికరాలతో ప్రయోగాలుచేస్తారు. కాని జర్మనీలో సైంటిస్టులు తమ పరిశోధనలకు కావలసిన పరికరాలను అప్పటికప్పుడు తయారుచేసుకుంటారు. అక్కడ పరిశోధనాశాలలన్నీ పరిశ్రమలతో పక్కపక్కనే అనుసంధానమై ఉంటాయి. ఆయా ప్రొఫెసర్లు చేసే పరిశోథనలకు పరిశ్రమలు అండగానిలుస్తాయి. వారి పరిశోథన ఫలితాలను జనబాహుళ్యంలోకి తీసుకువచ్చేందుకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తాయి. పరిశోథనశాలల్లో మౌలికసదుపాయాలు ఆధునికంగా ఉంటాయి.
ఈ సదస్సు విద్యార్థులకు ఏవిధంగా ఉపయోగపడుతుందని మీరు భావిస్తున్నారు ?
విద్యార్థులందరూ తమకు నచ్చిన రంగంలో ఏదో సాధించాలనే లక్ష్యంతో ఉంటారు. అయితే వారికి సరైన ప్రోత్సాహం లభించక పోవచ్చు. మార్గ నిర్దేశం చేసేవారు లేక లక్ష్యంపై స్పష్టత కొరవడి ఎంచుకున్న దారిలో నడవలేకపోతున్నారు.అలాంటి విద్యార్థులకు ఈ సదస్సు మేథావులతో కలిసి మాట్లాడి వారి అభిప్రాయాల్ని పంచుకొనే అరుదైన అవకాశాన్ని కల్పిస్తోంది. ఇది కచ్ఛితంగా దారితెలియని విద్యార్థికి దిక్సూచిలా ఉపయోగపడుతుంది. తత్ఫలితంగా ఆయా విద్యార్థులందరూ తమ లక్షాల్లో విజయం సాధించేందుకు తోడ్పడుతుంది. నావరకు… ఫిజిక్స్‌రంగంలో నేనేం సాధించాలో పూర్తి స్పష్టత వచ్చింది. ఫిజిక్స్‌లో నోబెల్ బహుమతి సాధించడం ఆషామాషీకాదు. ఎంతోకష్టపడి, ఎన్నోఏళ్లు శ్రమిస్తేనే అది సాధ్యమవుతుంది. నేనూ ఎప్పటికైనా ఆ స్థాయిలో ఉండాలని నిర్ణయించుకున్నాను. పరిశోధన పై నా ఆసక్తి ఈ సదస్సుకు హాజరవ్వడంతో మరింత పెరిగింది.
మీ జీవిత లక్ష్యం?
పీహెచ్‌డీ చేసి శాస్త్రవేత్తగా పరిశోధనలు చేయాలి. ప్రస్తుతం సైన్స్‌లో జరుగుతున్న పరిశోధనల వెనుక లేజర్ ఫిజిక్స్ పాత్ర చాలా ఉంది. లేజర్ ఫిజిక్స్‌పై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా లేజర్ ఫిజిక్స్ సాయంతో సోలార్ విద్యుత్తు సామర్థ్యాన్ని పెంచడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో లేజర్‌ఫిజిక్స్‌లో కొత్త సూత్రాలు కనిపెట్టడమే ధ్యేయం.
You can find my original interview at: http://goo.gl/984egr